లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు: ప్రధాని మోదీ

  • అఖిలపక్ష నేతలతో సమావేశంలో వ్యాఖ్య
  • మన దేశంలో వైరస్ కంట్రోల్‌లోనే ఉందన్న ప్రధాని
  • ప్రజలను కాపాడుకునేందుకు లాక్‌డౌన్ ఏకైక మార్గమన్న మోదీ
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను వచ్చే వారం ఎత్తివేసే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూచాయగా చెప్పారు. లాక్ డౌన్ కారణంగా వనరులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా కంట్రోల్‌లోనే వున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు. మన ప్రజలను కాపాడుకునేందుకు లాక్‌డౌన్‌ ఏకైక మార్గమని ఆయన పునరుద్ఘాటించారు.

‘నేను ముఖ్యమంత్రులు, జిల్లాల అధికారులు, నిపుణులతో తరచూ మాట్లాడుతున్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని నాకు ఎవ్వరూ చెప్పడం లేదు. సామాజిక దూరం పాటించడానికి మనకు కఠిన నిబంధనలు అవసరం. అలాగే, కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రులతో నేను మరోసారి మాట్లాడుతా. అయితే, ప్రస్తుతానికైతే  లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదు. మేం జిల్లా స్థాయి అధికారులతో కూడా చర్చిస్తున్నాం. మన దేశం వరకు ప్రజలను కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్ మాత్రమే’ అని అఖిలపక్ష నేతలతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ అభిప్రాయపడ్డారు.

   ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సానుకూలంగా ఉంటేనే.. కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష నేతలతో సమావేశం విజయవంతమైందని మోదీ చెప్పారు.  ఈ కష్ట కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఐకమత్యంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. అలాగే, వైరస్ కట్టడిలో గొప్పగా పని చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News