మెడ్ టెక్ జోన్ లో ర్యాపిడ్ కిట్ల తయారీకి అనుమతినిచ్చాం: ఏపీ మంత్రి మేకపాటి

  • ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్ల తయారీ
  • ప్రతి టెస్టుకూ ప్రభుత్వానికి రూ.1,200 ఖర్చు 
  • కేవలం 55 నిమిషాల్లోనే టెస్టు ఫలితం తెలుసుకోవచ్చు
మెడ్ టెక్ జోన్ లో ‘కరోనా’ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతినిచ్చామని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతున్నాయని, ప్రతి టెస్టుకూ ప్రభుత్వానికి రూ.1,200 ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ కిట్లను ఉపయోగించి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, పీసీఆర్ టెస్టులు చేయవచ్చని, కేవలం 55 నిమిషాల్లోనే టెస్టు ఫలితం తెలుసుకోవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ‘కరోనా’ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని, జగన్ ముందు చూపు వల్లే ఇవి తయారు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ నెల 15 నుంచి వెంటిలేటర్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నెలాఖరు వరకు రోజుకు మూడు నుంచి నాలుగు వేల పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా కిట్లు తయారు చేస్తున్నామని అన్నారు. మే నాటికి 7.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తామని, మన అవసరాలకు ఉంచుకోగా మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని చెప్పారు.


More Telugu News