ఐపీఎల్ ఈ ఏడాది తప్పకుండా జరిగి తీరుతుంది: స్టీవ్ స్మిత్

  • గత నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
  • కరోనా మహమ్మారి కారణంగా ఈ నెల 15కు వాయిదా
  • మరోమారు వాయిదా పడే అవకాశం
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది జరిగి తీరుతుందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మిత్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నాడు. పరిస్థితులు చక్కబడ్డాక ఈ ఏడాది ఏదో ఒక సమయంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తారన్న నమ్మకంతో ఉన్నట్టు చెప్పాడు.

2015లో షేన్ వాట్సన్ నుంచి బాధ్యతలు అందుకున్నానని పేర్కొన్న స్మిత్.. రాజస్థాన్ రాయల్స్‌కు రెండు సీజన్లలో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్సీ చేశానని, ఈసారి పూర్తిస్థాయిలో సారథ్యం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నానని పేర్కొన్నాడు. కాగా, గత నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ను, కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తుండడంతో ఈ నెల 15కు వాయిదా వేశారు.

అయితే, పరిస్థితి నెమ్మదించకపోవడం, దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15న ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనని అంటున్నారు. ఈ నెల 14వ తేదీ లోపు ఐపీఎల్‌పై బీసీసీఐ మరోమారు ప్రకటన చేసే అవకాశం ఉంది.


More Telugu News