లాక్‌డౌన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. హోంగార్డు మృతి

  • గుంటూరు జిల్లాలో ఘటన
  • విధులకు బైక్‌పై బయలుదేరిన హోంగార్డులు
  • శునకం అడ్డం రావడంతో డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
లాక్‌డౌన్ విధులను నిర్వర్తించేందుకు వెళ్తున్న ఓ హోంగార్డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పిట్టలవానిపాలెం మండలానికి చెందిన శ్రీనివాసరావు, నారాయణస్వామి హోంగార్డులు. లాక్‌డౌన్ విధుల్లో భాగంగా వీరికి జిల్లాలోని దాచేపల్లి మండలం పొందుగుల బోర్డర్ పోలీస్ చెక్‌పోస్టు వద్ద అధికారులు డ్యూటీలు వేశారు. దీంతో ఇద్దరూ బైక్‌పై పొందుగుల బోర్డర్ వద్దకు బయలుదేరారు.

మరికాసేపట్లో పొందుగుల చేరుకుంటారనగా రహదారిపై శునకం అడ్డం రావడంతో, దానిని తప్పించేందుకు ప్రయత్నించే క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. శ్రీనివాసరావు, నారాయణస్వామి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన హోంగార్డు నారాయణస్వామిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.


More Telugu News