కరోనాను కట్టడి చేస్తున్న బీసీజీ టీకా.. ఆశలు రేపుతున్న తాజా నివేదికలు

  • క్షయ వ్యాధి బారిన పడకుండా పిల్లలకు వేసే టీకా  
  • టీకా వేసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ
  • శ్వాసకోశ సంబంధ సమస్యలకు పరిష్కారం

క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ గురిన్) టీకాతో కరోనా అదుపులో ఉంటోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ టీకాను వేసుకున్న వారికంటే, వేసుకోని వారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తించారు. అలాగే కరోనా వైరస్ బారినపడి శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలిగించవచ్చునని అంచనా వేస్తున్నారు. క్షయవ్యాధి బారిన పడకుండా బాల్యంలోనే పిల్లలకు ఈ టీకా వేస్తారు. దీనివల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి క్షయవాధి బారిన పడకుండా ఉంటారు. అదే మందు ఇప్పుడు కరోనా కట్టడికి మనకు తెలియకుండానే ఉపయోగ పడుతోందని భావిస్తున్నారు.

1920లో కనిపెట్టిన ఈ టీకాను మన దేశంలో 1948 నుంచి మాస్ ఇమ్యూనేజేషన్ టీకాగా వినియోగిస్తున్నారు. దీంతో శిశు మరణాల సంఖ్య చాలావరకు అదుపులోకి వచ్చిందని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రబలి ఉన్న నేపథ్యంలో ఇదే టీకా చాలామందికి రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని గుర్తించారు.

హ్యూస్టన్లోని ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ ప్రొఫెసర్ ఆశిష్ కామత్ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ 'పిల్లలకు మాస్ ఇమ్యూనేజేషన్ కార్యక్రమంగా బీసీజీ టీకా వేస్తున్న దేశాలతో పోల్చితే, ఈ కార్యక్రమాన్ని చేపట్టని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది' అని తేల్చిచెప్పారు.

'బీసీజీ టీకా వేస్తున్న దేశాల్లో బాధితుల సంఖ్య పది లక్షల మందికి 38.4 ఉంది. అదే వేయని దేశాల్లో ఈ సంఖ్య 358.4గా ఉంది. అలాగే మరణాల సంఖ్య టీకా వేస్తున్న దేశాల్లో పది లక్షల మందికి 4.28గా ఉంటే, వేయని దేశాల్లో 40గా ఉంది' అని ఆయన వివరించారు. ఇందుకు అమెరికా, ఇటలీ, నెదర్లాండ్ దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు. ఈ దేశాల్లో బీసీజీ టీకా మాస్ కార్యక్రమం లేని విషయాన్ని గుర్తు చేశారు.



More Telugu News