వూహాన్ నగరానికి లాక్‌డౌన్ నుంచి విముక్తి.. 76 రోజుల కట్టడికి స్వస్తి!
- కరోనా వైరస్ తొట్టతొలిసారి గుర్తించింది ఇక్కడే
- దీంతో జనవరి 23న లాక్ డౌన్ విధించిన అక్కడి ప్రభుత్వం
- నగరంలో కోటి 10 లక్షల జనాభా
చైనాలోని ప్రధాన ఉత్పాదక, వ్యాపార కేంద్రం వూహాన్ నగరానికి లాక్‌డౌన్ నుంచి విముక్తి లభించింది. దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న ఈ మహానగరం ప్రజలు 76 రోజుల అనంతరం స్వేచ్చా ప్రపంచంలోకి అడుగు పెట్టారు.
ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 200 దేశాలు ఎదుర్కొంటున్న కరోనా సమస్యకు కేంద్ర స్థానం చైనాలోని వుబే రాష్ట్ర రాజధాని వూహాన్ నగరం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను గత ఏడాది డిసెంబరులో మొదటిగా ఈ నగరంలోనే గుర్తించారు. దీంతో జనవరి 23వ తేదీ నుంచి ఈ నగరంలో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.
ఈ రోజు నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆరోగ్యంగా ఉన్న వారు, సందర్శకులు నగరాన్ని విడిచి వెళ్లడానికి అనుమతిని ఇస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దులను తెరిచింది. విమాన, రైళ్ల ప్రయాణాలను పునరుద్ధరించింది. దీంతో ఈరోజు ఒక్కరోజే రైలు ద్వారా దాదాపు 55 వేల మంది నగరాన్ని విడిచి వెళ్లే అవకాశం వుందని అక్కడి రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో 40 శాతం మంది చైనాలోని అతి పెద్ద వస్తు ఉత్పత్తి కేంద్రం పీర్ల్ రివర్ డెల్టా ప్రాంతానికి చెందిన వారేనని ప్రకటించింది.
లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ అంతర్గతంగా నగరవాసులు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని, లేదంటే ఎక్కడైనా పొంచివున్న వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్-19తో పోరాటం ప్రారంభించిన అనంతరం కట్టడి చర్యల నుంచి వూహాన్ నగరానికి విముక్తి లభించడం ఓ మైలురాయిగా పరిశీలకులు భావిస్తున్నారు.
'లాక్‌డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ ప్రజా జీవనం ఆగిపోయిన చోటు నుంచి మొదలుకానుంది. కానీ సమస్య పూర్తిగా తొలగిపోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదు. అప్రమత్తంగా వ్యవహరించడం తప్పనిసరి' అని వూహాన్ నగరానికి చెందిన విపత్తు నిర్వహణ అధికారి ఒకరు సూచించారు.
'పరిశ్రమలు తెరిచాక ఉత్పత్తి ప్రక్రియ మొదలైతే వందలు, వేల మంది ఒకే చోట పనిచేయడం సహజం. ఈ సందర్భంలో మాస్క్ లు ధరించడం వంటి ముందు జాగ్రత్తలను విస్మరించడం జరుగుతుంది. దీనివల్ల వైరస్ వ్యాప్తి జరగదని కచ్చితంగా చెప్పలేం. అందువల్ల నిర్లక్ష్యం కూడదు' అని ఆ అధికారి హెచ్చరించారు.