భారత్‌పై ట్రంప్ నిన్న కారాలుమిరియాలు.. నేడు ప్రశంసలు!

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్‌ డోసులు కొన్నాను
  • భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను 
  • వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను
  • సానుకూలంగా స్పందించారు 
కరోనా వ్యాప్తితో ఛిన్నాభిన్నమవుతున్న తమ దేశ పరిస్థితుల గురించి ఇటీవల మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధం విధించిన భారత్‌ మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్‌ మరోసారి మాట్లాడుతూ, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్‌ డోసులు కొన్నాను. దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను.. భారత్‌ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను. సానుకూలంగా స్పందించారు. ఆయన చాలా మంచి దృక్పథంతో ఉన్నారు. భారత్‌కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం, అందుకే వాటి ఎగుమతులను ఆపేశారు' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల మోదీతో మాట్లాడిన ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌ను ఎగుమతి చేయాలని కోరారు. అయితే, ఆ మరుసటి రోజే భారత్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పాటు పలు ఔషధాల విడుదలపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్‌ భారత్‌పై మండిపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇప్పుడు మళ్లీ భారత్‌ ఆ నిషేధం ఎత్తి వేస్తూ పలు దేశాలకు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ట్రంప్‌ మళ్లీ కూల్‌ అయి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.


More Telugu News