ఒక్కరోజులో 40 కొత్త కేసులు... తెలంగాణలో 400 దాటిన కరోనా బాధితులు!

  • చికిత్స పొంది 45 మంది డిశ్చార్జ్
  • వివిధ ఆసుపత్రుల్లో 348 మందికి చికిత్స
  • వెల్లడించిన టీఎస్ మంత్రి ఈటల
తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 404కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాకు చికిత్స పొంది 45 మంది కోలుకున్నారని, మరో 11 మంది మరణించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 348 మంది చికిత్సలు పొందుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రికార్డు సమయంలో 1,500 పడకల ఆసుపత్రిగా మార్చామని, ఇక్కడ ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలను కరోనా చికిత్స కోసం రెడీ చేశామని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బృందంతో చర్చించి, 12 వేల బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు.

వైద్యులకు అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్క్ లను లక్షల సంఖ్యలో సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధులందిస్తున్న దాతలకు కృతజ్ఞతలని ఈటల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, సీఎస్ నిత్యమూ కరోనా పరిస్థితిపై సమీక్షలు చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో శ్రమిస్తున్న ఆరోగ్య, మునిసిపల్, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
.


More Telugu News