వైన్ షాపులు ఓపెన్ చేయించండి... పది మంది ముఖ్యమంత్రులకు సీఐఏబీసీ లేఖ!

  • షాపులు మూతబడ్డా, అక్రమ అమ్మకాలు సాగుతున్నాయి
  • ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది
  • షాపులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
వెంటనే మద్యం అమ్మకాలను అనుమతిస్తూ, మూతబడివున్న వైన్ షాపులను తెరిపించాలని తెలంగాణ సహా 10 రాష్ట్ర ముఖ్యమంత్రులకు సీఐఏబీసీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్) ఓ లేఖను రాసింది. లాక్‌ డౌన్‌ నిబంధనల మేరకు మద్యం షాపులను మూసివేసినా, ఎన్నో ప్రాంతాల్లో అక్రమ అమ్మకాలు ఆగలేదని గుర్తు చేసిన సీఐఏబీసీ, షాపుల మూసివేతతో తాగుడుకు అలవాటు పడినవారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది.

దీని ప్రభావం భవిష్యత్తులో శాంతి భద్రతలపైనా పడవచ్చని సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్‌ వినోద్‌ గిరి హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నిర్ణీత పని వేళలను, సామాజిక దూరాన్ని పాటిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని షాపులను తెరిపించాలని ఆయన సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాల విషయంలో సడలింపులు ఇచ్చాయని గుర్తు చేసిన ఆయన, ప్రజారోగ్యం దృష్ట్యా, రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.


More Telugu News