కరోనా లక్షణాలు లేవు కానీ పాజిటివ్ వచ్చింది... చాపకింద నీరులా విస్తరిస్తున్న కొవిడ్-19!

  • కేరళలో ఓ వృద్ధుడికి, విద్యార్థినికి కరోనా
  • పైకి ఆరోగ్యంనే ఉన్న ఇరువురు
  • ఇది ప్రమాదకరమైన సరళి అంటున్న కేరళ వర్గాలు
కరోనా మహమ్మారే కాదు, మాయలమారి కూడా! తాజాగా ఈ వైరస్ ఉనికి గురించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా సోకిన విషయం కొన్ని ప్రత్యేక వ్యాధి లక్షణాల ద్వారానే ఇప్పటివరకు గుర్తిస్తూ వచ్చారు. అయితే, పైకి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా, కేరళలో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రమాదకరమైన సరళి అని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లక్షణాలు బయటపడని స్థితిలో ఆ వ్యక్తులు మరెంతో మందిని కలుస్తారని, తద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడికి, 19 ఏళ్ల విద్యార్థినికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వృద్ధుడు దుబాయ్ నుంచి రాగా, విద్యార్థిని ఢిల్లీ నుంచి వచ్చింది. బయటి నుంచి వచ్చారన్న కారణంతో వారిద్దరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పాజిటివ్ ఫలితం వచ్చింది.

దీనిపై పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ స్పందిస్తూ, ఇదో ప్రమాద సంకేతం అని, వేలమంది అమాయకులకు కరోనా సోకే అవకాశముందని, వాళ్లు తమకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తారని అన్నారు. వాళ్లలో ఎలాంటి లక్షణాలు లేకుండా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుంటున్నారని, కానీ వారు బయటికి వస్తే జరిగే పరిణామాలను ఊహించలేమని తెలిపారు.


More Telugu News