లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకున్న మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం

  • 15వ తేదీ నుంచి పని చేయనున్న కార్యాలయాలు
  • రోడ్లపై వాహనాలకు అనుమతి
  • ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం కొనసాగనున్న నిషేధం
కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 14తో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను అంతటితో ఆపేస్తారా? లేక మళ్లీ కొన్ని రోజుల పాటు పొడిగిస్తారా? అనే సందేహం అందరిలో నెలకొంది. లాక్ డౌన్ ను మరిన్ని రోజుల పాటు కొనసాగించాలని ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విన్నవించారు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించబోతున్నామని... అన్ని కార్యాలయాలు యథాతథంగా పని చేస్తాయని ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది.

రోడ్లపై అన్ని వాహనాలను అనుమతిస్తామని, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయని మేఘాలయ ప్రభుత్వం తెలిపింది. విద్యా సంస్థలు మాత్రం ఏప్రిల్ 30 వరకు మూతపడతాయని చెప్పింది. మేఘాలయలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో, లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. అయితే వైద్య అధికారుల సూచనలను గ్రామీణ ప్రాంత ప్రజలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.


More Telugu News