తొలిసారిగా.. కరోనా మృతి కేసు ఏదీ నమోదు కాలేదు!: చైనా ప్రకటన

  • చైనాలో రెండోసారి కొత్త కేసుల నమోదు
  • ఇప్పటివరకు కొత్తగా 32 కేసులు
  • ప్రస్తుతం మొత్తం 1,033 మందికి ఆస్పత్రుల్లో చికిత్స
కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో జనవరి నుంచి ప్రతి రోజూ ఈ వైరస్‌ కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే, తమ దేశంలో తొలిసారిగా కరోనా వైరస్‌ మృతి కేసు ఏదీ నమోదు కాలేదని చైనా ఈ రోజు ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా కారణంగా ఆ దేశంలో మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే వుంది. మార్చి నుంచి ఆ దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గాయి. అయితే, చైనాపై కరోనా రెండో సారి పడగవిప్పుతోంది.
 
ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 1,000 మందికి కరోనా ఉన్నట్లు చైనా తెలిపింది. కాగా, దేశ వ్యాప్తంగా కొత్తగా 32 కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,033గా ఉందని తెలిపారు.  

వుహాన్‌లో ఇప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. ఆ దేశంలో మొత్తం 81,740 మంది ప్రజలకు కరోనా సోకగా 3,331 మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్‌లోనే బాధితులు అధికంగా ఉన్నారు. యూరప్‌, అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.


More Telugu News