సరిహద్దులను మూసేసి ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది: కర్ణాటక తీరుపై సుప్రీంలో కేరళ అఫిడవిట్

  • కర్ణాటక తీరుతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు
  • నిత్యావసరాల సరఫరాను అడ్డుకుంటోంది
  • కేంద్రం సత్వరమే జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థన
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా దాదాపు అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేశాయి. కర్ణాటక కూడా తమ రాష్ట్రంలోకి వచ్చే జాతీయ రహదారులు, సరిహద్దు రోడ్లను మూసివేసింది. అయితే, ఇలా మూసివేయడం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సరిహద్దులను మూసివేసి వైద్య చికిత్స కోసం వెళ్లే ప్రజలను, నిత్యావసర సరఫరాను అడ్డుకుందని, ఇది ముమ్మాటికి పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. కాబట్టి వాటిని వెంటనే తెరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది.

సరిహద్దులను మూసివేయడం వల్ల ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారని, సరిహద్దులను తెరవాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన తర్వాత మరొకరు చనిపోయారని కేరళ పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని కర్ణాటక మూసివేసిన సరిహద్దులను తెరిపించాలని చికిత్స కోసం రోగులు వెళ్లేలా, నిత్యావసరాల సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకునేలా చూడాలని కేరళ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోరింది. అత్యున్నత ధర్మాసనం నేడు ఈ కేసును విచారించనుంది.


More Telugu News