కరోనా ఫేక్ ప్రచారంపై పోలీసుల ఉక్కుపాదం.. 25 మంది అరెస్ట్

  • ఫలితాలిస్తున్న ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్
  • వారం రోజుల్లో 20 తప్పుడు వార్తల గుర్తింపు
  • పాత వీడియోలను తెలివిగా ఎడిట్ చేస్తున్న నిందితులు
ప్రాణాంతక కరోనా వైరస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. అసత్య ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ వెబ్‌సైట్ ‘ఫ్యాక్ట్‌చెక్.తెలంగాణ.జీవోవీ.ఇన్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ వెబ్‌సైట్ గత వారం రోజుల్లో 20 తప్పుడు వార్తలను గుర్తించింది.

ఇక, ఫేక్‌న్యూస్‌పై గత వారం రోజుల్లో 200 వరకు ఫిర్యాదులు అందినట్టు ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తెలిపారు. ప్రతి క్షణం 300 మందికిపైగా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, వైద్యులు, పోలీసులు, అధికారుల పేరిట తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేక్ న్యూస్‌ను వైరల్ చేయడంలో కొందరు అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. పాత వీడియోలు, ఫొటోలను ఎడిట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీనిని గుర్తించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిజనిర్ధారణకు ఆరుగంటలకు పైగా సమయం పడుతోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.


More Telugu News