ఏపీలో ఆ రెండు జిల్లాల్లో కనిపించని కరోనా!

  • ఏపీలో 300 దాటిన కరోనా కేసులు
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కేసులు నిల్
  • ఢిల్లీ వెళ్లకపోవడమే కారణం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న రాత్రికి మొత్తం కేసుల సంఖ్య 300 దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలోనూ చొరబడిన వైరస్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు కాలుపెట్టలేకపోయింది. కారణం ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సదస్సుకు ఈ రెండు రాష్ట్రాల నుంచి పెద్దగా ఎవరూ వెళ్లకపోవడమేనని తెలుస్తోంది. వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్ నిబంధనను పాటిస్తుండడంతో ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ సదస్సుకు ఎవరూ వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీ నుంచి వస్తున్నవారు ప్రయాణించిన రైలు బోగీలో ఈ జిల్లాకు చెందిన 18 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో 12 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించిన అధికారులు నమూనాలు పరీక్షించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. మిగతా ఆరుగురు జిల్లాలో అడుగుపెట్టకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఇక విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు మాత్రం తబ్లిగీ జమాత్ సదస్సుకు వెళ్లారు. వీరి నమూనాలను పరీక్షించగా ఫలితాలు నెగటివ్ వచ్చాయి. మరో 17 మంది అనుమానితులకు సంబంధించిన నమూనాలను పరీక్షల కోసం కాకినాడ పంపారు. వీరిలో 14 మంది రిపోర్టులు నెగటివ్ రాగా, మిగతా మూడింటి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.


More Telugu News