టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడి అరెస్టు.. ఖండించిన ఎంపీ కేశినేని నాని

  • భీమవరంలో రామానాయుడుని అరెస్టు చేసిన పోలీసులు
  • నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి ఆయన
  • రామానాయుడుని వెంటనే విడుదల చేయాలి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆయన పాలకొల్లు నుంచి సైకిలుపై ఏలూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

 పోలీసులు అడ్డుకోవడం తగదు: రామానాయుడు

తనను అరెస్టు చేయడంపై రామానాయుడు స్పందిస్తూ, మంత్రుల దగ్గర నుంచి వార్డు సభ్యుల వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాలని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే చెప్పారని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకని తాను ఒక్కడినే సైకిల్ పై వస్తుంటే ఇలా పోలీసులు అడ్డుకోవడం తగదని అన్నారు.

‘కరోనా’ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ వస్తున్న తనపై పోలీసులు కేసు పెట్టడం చాలా అన్యాయమని, ఓ ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం తాను ఎన్ని ఇబ్బందులు పడేందుకైనా సిద్ధమేనని చెప్పారు.

ఎంపీ కేశినేని నాని ఖండన..
 
కాగా, రామానాయుడిని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రామానాయుడిని అరెస్టు చేయడం అన్యాయమని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు.  


More Telugu News