ఢిల్లీ సమావేశానికి వెళ్లొచ్చిన వారి వివరాలు అడుగుతుంటే... ఎన్నార్సీ కోసమని అనుమానిస్తున్న కుటుంబాలు!

  • తెలంగాణ నుంచి మర్కజ్ కు వెళ్లిన 1,030 మంది
  • ఇంకా లభించని 100 మంది ఆచూకీ
  • ఢిల్లీ నుంచి పలు మార్గాల్లో రావడమే కారణం
  • వారి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలు
గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్న హెల్త్ వర్కర్లకు తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయి. హెల్త్ వర్కర్లు వెళ్లి, ఇంటి నంబర్లు, ఆధార్ కార్డు వివరాలు అడుగుతూ ఉంటే, ఎన్నార్సీ సర్వే కోసం వచ్చారని అనుమానిస్తున్న కొన్ని కుటుంబాలు, సమాచారాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. మరోసారి తమ ఇళ్లకు వస్తే, దాడి చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో హెల్త్ వర్కర్లంతా పోలీసులను ఆశ్రయిస్తుండగా, ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసులకూ ప్రతిఘటన తప్పడం లేదు.

వివరాలను సేకరించేందుకు వచ్చిన పోలీసులు సైతం, కొన్ని కుటుంబాలను ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిరాగా, వారిలో ఇంకా 100 మంది ఆచూకీని పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఇదే సమయంలో ఒక్కరోజులో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, వీరందరినీ ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మర్కజ్ కు వెళ్లిన వారిలో అందరూ నేరుగా స్వస్థలాలకు చేరుకోని కారణంగానే, వారి వివరాలు తెలియడం లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. రైళ్లలో, విమానాల్లో వచ్చిన వారిని, వారితో కలిసున్న వారిని క్వారంటైన్ చేసినప్పటికీ, ఇతర మార్గాల్లో వచ్చిన వారు మాత్రం ఇంకా చిక్కలేదు. వీరంతా మార్గమధ్యంలో పలు ఇతర ప్రార్థనా మందిరాలకు వెళ్లారు. ఆపై ఆలస్యంగా తెలంగాణకు చేరుకుని, స్వస్థలాలకు వెళ్లి, దైనందిన కార్యకలాపాల్లో భాగమయ్యారు.

వీరిలో అత్యధికులు లాక్ డౌన్ నిబంధనలను, కరోనా మహమ్మారిని మరచిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పలువురు ఢిల్లీ వెళ్లి వచ్చి, క్వారంటైన్ పాటించలేదు. ఓ సచివాలయ ఉద్యోగి క్వారంటైన్ పాటించక పోవడంతో హైదరాబాద్ లోని సెక్రటేరియేట్ తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో సింగరేణిలో కరోనా విస్తరణకూ క్వారంటైన్ పాటించకపోవడమే కారణమైంది.

ఇదిలావుండగా, నల్గొండలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో, అతని వద్ద విద్యను అభ్యసిస్తున్న 60 మంది చిన్నారుల్లో, వారి ఇళ్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక, కరోనా విషయంలో సమాచారాన్ని దాచిన వారిపై కఠిన కేసులను పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నా, పరిస్థితి మారకపోవడం అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు తమంతట తామే ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి వారు ఎవరి గురించైనా తెలిస్తే, ప్రజలు కూడా 100కు ఫోన్ చేసి విషయం చెప్పాలని పోలీసులు కోరుతున్నారు.


More Telugu News