26 వేల మందిని క్వారంటైన్ చేసిన ఒకే ఒక్క విందు!

  • తల్లి మృతికి సంతాపంగా విందు
  • హాజరైన 1200  మంది
  • మధ్యప్రదేశ్‌లోని మురేనాలో ఘటన
తల్లి మృతికి సంతాపంగా ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విందు 26 వేల మందిని క్వారంటైన్‌ పాలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్. గత నెలలో అతడి తల్లి చనిపోవడంతో 17న దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత అంటే మార్చి 20న  సంప్రదాయం ప్రకారం.. తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది దీనికి హాజరయ్యారు.

అనంతరం 27న అతడితోపాటు ఆ వ్యక్తి భార్య కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టాడు. తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరారు.


More Telugu News