గిన్నిస్ వరల్డ్ 'లాక్‌డౌన్' ఛాలెంజ్...ప్రయత్నిస్తే మీరే విజేత కావచ్చు!
- టాయ్‌లెట్ పేపర్ రోల్ 30 సెకన్ల పాటు కిందపడకుండా ఎగరేయాలి
- ఆ వీడియో తీసి పంపాలి
- వారానికో విజేతను ప్రకటిస్తుందీ సంస్థ
ప్రపంచవ్యాప్తంగా పేరున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు సంస్థ లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి ఓ ఛాలెంజ్ విసింది. ఇంట్లో ఊరికే కూర్చోకుండా తాము విసిరిన ఛాలెంజ్‌లో పాల్గొని మీ సత్తా నిరూపించుకోండని అంటోంది. ఇంతకీ ఏం చేయాలంటే టాయ్‌లెట్ లో ఉపయోగించే టిష్యూ పేపర్ రోల్‌ను 30 సెకన్ల పాటు కిందపడకుండా గాల్లోనే ఎగరేయాలి. 'ఓస్ ఇంతేనా...' అనుకుంటున్నారా. ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్. ఇలా పేపర్ రోల్ ఎగరేయడానికి చేతుల్ని, మోచేతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. కెమెరా ముందుకు వచ్చాక 3, 2, 1, రెడీ అనగానే ఎగరేయడం ప్రారంభించాలి.
ఇలా ఎగరేస్తుండగా తీసిన వీడియోను సంస్థకు పంపాలి. వీడియో అప్‌లోడ్ చేసేందుకు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాంలను ఉపయోగించుకోవచ్చు. వీడియోకు జీడబ్ల్యూఆర్ చాలెంజ్ అన్న హ్యాష్ ట్యాగ్ జత చేయాలి. ఇలా 30 సెకన్లలో ఎవరు ఎక్కువసార్లు ఎగరవేస్తారో వారే విజేత. ఎగరేసే క్రమంలో పేపర్ రోల్ గోడకు, కుర్చీలకు తగిలినా, కిందపడినా ప్రయత్నం విఫలమైనట్టే.
అలాగే ఎడిట్ చేసి వీడియోలు పంపినా అనర్హత వేటు పడుతుంది. అర్హమైన వీడియోల నుంచి వారానికో విజేతను సంస్థ ప్రకటిస్తుంది. తర్వాత వారం మీ రికార్డును మీరే బద్దలు కొట్టొచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఓ ప్రయత్నం చేయండి. మీరే విజేత కావచ్చు.