తెలంగాణ లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఇదే!

  • మూడో వారం నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత
  • ఈలోగా అన్ని హాట్ స్పాట్ ల గుర్తింపు
  • కసరత్తు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ
  • హైదరాబాద్ లో కొనసాగనున్న నిబంధనలు
ఈ నెల రెండో వారంతో అధికారికంగా లాక్ డౌన్ ముగియనుండగా, ఆ తరువాత ఎలాగైనా లాక్ డౌన్ ను తొలగించాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు, అందుకు తగ్గట్టుగా ఎగ్జిట్ స్ట్రాటజీని తయారు చేస్తోంది. ఉన్నతాధికారులు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం, దశలవారీగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను తొలగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారు తిరిగిన ప్రాంతాలు, కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా పేర్కొంటున్న అధికారులు, మొత్తం 25 హాట్ స్పాట్ లను గుర్తించారు.

ఇక ఈ నెల 10 నాటికి మరో 25 హాట్ స్పాట్ లను గుర్తించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్న అధికారులు, మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు ఉంటున్న ప్రాంతాలు మినహా, మిగతా చోట్ల కొత్త కేసులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 50 హాట్ స్పాట్ లు రాష్ట్రంలో ఉండవచ్చని, వీటిని మ్యాపింగ్ చేసి, ఈ ప్రాంతాల్లో 'కంటైన్‌మెంట్‌ ప్లాన్'ను అమలు చేస్తూ, మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తెచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే, లాక్ డౌన్ ఎత్తివేయాలంటే, పదో తేదీ తరువాత మాత్రమే స్పష్టత వస్తుందన్నది అధికారుల ఉద్దేశం. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. వీటిల్లోనూ మర్కజ్ తో సంబంధమున్న కేసులే 80 శాతం వరకూ ఉన్నాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిలోనే కరోనా బయటపడటంతో, వైరస్ ఇంకా జనసమూహంలోకి వెళ్లిన దాఖలాలు లేవన్నది అధికారుల వాదన. ఈ నెల 10 లోగా మర్కజ్ తో సంబంధాలున్న ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న అధికారులు, ఈలోగా కేసుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలో ఉన్నారు.

10 తరువాత కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తే, 15 తరువాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్, వరంగల్ పట్టణం, కరీంనగర్ మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అది జరగాలంటే, ఒక రోజులో నమోదయ్యే కేసుల సంఖ్య ఐదారు కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇదే సమయంలో మరికొంతకాలం రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని, హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో వైరస్ నియంత్రణలోకి వచ్చిందని తేలిన తరువాత మాత్రమే లాక్ డౌన్ తొలగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక, లాక్ డౌన్ ను తొలగించాలని భావిస్తే, హాట్ స్పాట్ల పరిధి, ఎంత దూరం వరకూ మ్యాపింగ్ చేయాలి? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రం నుంచి వెలువడే మార్గదర్శకాలను అనుసరించి, ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ, అందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.


More Telugu News