కరోనా మృతులకు సంతాపం.. దేశ వ్యాప్తంగా మూడు నిమిషాల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించిన చైనా

  • 3 నిమిషాలు మౌనం
  • హారన్ మోగించిన కార్లు, రైళ్లు, ఓడలు
  • ఎయిర్‌ రైడ్‌ సైరన్లు కూడా 
  • వుహాన్‌లో 3 నిమిషాలు ట్రాఫిక్‌ రెడ్‌ సిగ్నల్‌
చైనాలో కరోనా బాధితుల మృతికి నివాళిగా దేశ వ్యాప్తంగా మూడు నిమిషాల పాటు మౌనం పాటించారు. అదే సమయంలో కార్లు, రైళ్లు, ఓడలు హారన్‌ మోగించాయి. ఎయిర్‌ రైడ్‌ సైరన్లు కూడా మోగిస్తూ, జాతీయ జెండాను సగం వరకు దించి కరోనా మృతులకు సంతాపం తెలిపారు.

అత్యధిక మరణాలు సంభవించిన వుహాన్‌లోని నగర ప్రాంతాల్లో ఉదయం పది గంటలకు మూడు నిమిషాల పాటు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద రెడ్‌ లైట్‌ వెలిగేలా చేసి, మూడు నిమిషాల పాటు ట్రాఫిక్‌ను ఆపేశారు. కరోనాపై పోరాటంలో 14 మంది వైద్యులూ చనిపోయారని, వారిని స్మరించుకుంటూ వారిని గౌరవించడానికి  ఈ కార్యక్రమం ఓ అవకాశం ఇస్తోందని చైనా ప్రభుత్వం తెలిపింది.

తమతో పాటు పనిచేసి ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బందిని తోటి వైద్య సిబ్బంది గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నట్లు ఓ నర్సు తెలిపింది. చైనాలో మొత్తం 3,300 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజును సంతాప దినంగా ప్రకటించారు. చైనాలోని హుబైలో గత ఏడాది మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది.

ఇప్పటివరకు 205 దేశాలకు కరోనా విస్తరించింది. మృతుల సంఖ్య 60 వేలకు చేరువలో ఉంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో సామాజిక దూరం, లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలను సడలిస్తోంది. అయితే, శనివారం 19 కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి.


More Telugu News