ఢిల్లీ వెళ్లొచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలి... మతపెద్దలతో ఫోన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్

  • తెలంగాణలో మరింతగా పెరిగిన కరోనా కేసులు
  • మర్కజ్ యాత్రికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్
  • అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉన్నాయి. ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతమైంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఓ మోస్తరు కేసులతో బయటపడొచ్చని భావించిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకట్రెండు రోజుల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో వెంటనే అప్రమత్తం అయ్యాయి.

అయితే, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి మర్కజ్ యాత్రికులు నిరాకరిస్తున్న నేపథ్యంలో, సీఎం కేసీఆర్ స్పందించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన మర్కజ్ యాత్రికులను ఒప్పించే బాధ్యతను మతపెద్దలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మతపెద్దలతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు.

85 శాతం కొత్త కేసులు ఢిల్లీ మర్కజ్ తో సంబంధమున్నవే కావడంతో తెలంగాణ అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే యుద్ధప్రాతిపదికన మర్కజ్ యాత్రికుల కోసం 6 కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేసి మర్కజ్ యాత్రికుల్లో ఎవరు కరోనా పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది తేల్చాలని సర్కారు కృతనిశ్చయంతో వుంది.


More Telugu News