డ్రోన్ల సాయంతో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు... ఐఐటీ గువహటి కొత్త టెక్నాలజీ
- బృందాలుగా థర్మల్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తం
- ఇందులో పరారుణ కెమెరా ఏర్పాట్లు
- ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లతో హెచ్చరికలు
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మూకుమ్మడి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఉపయుక్తమయ్యే డ్రోన్ల పరిజ్ఞానాన్ని గువహటి ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మానవ ప్రమేయం లేకుండా ఆకాశం నుంచే ఆ ప్రాంత ప్రజల శరీర ఉష్ణోగ్రతలను ఈ పరికరం ద్వారా కొలవవచ్చు. 'మారుత్ డ్రోన్ టెక్' పేరుతో స్టార్టప్ ను ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సమస్యకు పరిష్కారాలపై పరిశోధనలు చేస్తోంది.
'ఈనెల 14వ తేదీ తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేస్తే జనం ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వస్తారు. అటువంటి సందర్భంలో భౌతిక దూరం నిబంధన అమలు కాదు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రాంతంలో అనుమానిత కేసులు ఎక్కువగా ఉంటే ఈ డ్రోన్ పరికరంతో గుర్తించేందుకు సులభంగా ఉంటుంది' అని పరిశోధకులు తెలిపారు.
ఈ డ్రోన్‌కు అమర్చిన పరారుణ కెమెరా బృందాలుగా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న చోట డ్రోన్లోని లౌడ్‌స్పీకర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైన సూచనలు చేస్తుంది.