కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలక ముందడుగు... ఎలుకల్లో పెరిగిన వ్యాధి నిరోధక శక్తి

  • కరోనా వైరస్ విజృంభణ
  • వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన పిట్స్ బర్గ్ వర్సిటీ
  • ఎలుకలపై వ్యాక్సిన్ ప్రయోగం
  • కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ఉప్పెనలా పుట్టుకొచ్చిన యాంటీబాడీలు
మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా, పిట్స్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో ముందడుగు వేశారు. వారు అభివృద్ధి చేసిన 'పిట్స్ బర్గ్ కరోనా వైరస్ వ్యాక్సిన్' ఎలుకల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని మోతాదుల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా మహమ్మారిని శక్తివిహీనం చేయవచ్చని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ-బయోమెడిసిన్ అనే జర్నల్ లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది.

ప్రయోగదశలో భాగంగా కొన్ని ఎలుకలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా, వాటిలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ఉప్పెనలా యాంటీబాడీలు పుట్టుకొచ్చాయి. కరోనా వ్యతిరేక వ్యాక్సిన్ తయారీలో స్పైక్ ప్రొటీన్ కీలకంగా మారిందని, వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపచేయడంలో ఈ ప్రొటీన్ ముఖ్యమైనదని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకురాలు ఆండ్రియా గంబోటో తెలిపారు. ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలిసిందని ఆమె వివరించారు.

వర్సిటీకి చెందిన మరో పరిశోధకుడు లూయిస్ ఫాలో స్పందిస్తూ, ఈ వ్యాక్సిన్ ను రోగులపై ప్రయోగించే ప్రక్రియకు కనీసం ఏడాదికిపై పైగా పడుతుందని, అయితే, ఎన్నడూ చూడని ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగదశను ఎప్పుడు దాటుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.


More Telugu News