కరోనా కేసుల్ని, హాట్ స్పాట్స్ ను త్వరగా గుర్తించాలి.. లేకుంటే ప్రమాదమే!: ఐసీఎంఆర్ సిఫార్సులు

  • కరోనా కేసుల గుర్తింపును వేగవంతం చేయాలి
  • యాంటీ బాడీ టెస్టింగ్ విధానాన్ని పాటించాలి
  • కేంద్రానికి ఐసీఎంఆర్ సలహా
దేశవ్యాప్తంగా కరోనా కేసులను సాధ్యమైనంత త్వరగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వైరస్ హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించి అక్కడి వారిని త్వరగా క్వారంటైన్ చేయాలని ఐసీఎంఆర్ (ది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) కేంద్రానికి సలహా ఇచ్చింది. దేశంలో 20 కరోనా హాట్ స్పాట్స్ ఇప్పటికే ఉన్నాయని, మరో 22 కొవిడ్-19 హాట్ స్పాట్స్ గా మారనున్నాయని తాము గుర్తించినట్టు పేర్కొన్న ఐసీఎంఆర్, ఈ ప్రాంతాల్లో యాంటీ బాడీ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని సూచించింది.

దేశంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐసీఎంఆర్ నేతృత్వంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కాగా, తొలి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న సభ్యులు, రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ - పీసీఆర్ (ఆర్టీ-పీసీఆర్) విధానంలో యాంటీ బాడీ పరీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. గొంతు, ముక్కులోని ద్రవాలను సేకరించడం ద్వారా కరోనా వైరస్ ను సులువుగా గుర్తించవచ్చని, వెంటనే వారిని క్వారంటైన్ చేయడం ద్వారా, వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని సలహా ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా వైరస్ బారిన పడిన వారికి దగ్గరగా మెలిగిన వారందరినీ గుర్తించకుంటే పెను ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరించింది.

ఇతర రక్త పరీక్షల రిపోర్టుల నుంచి వచ్చే ఫలితాలతో పోలిస్తే, ఈ పరీక్షలను 15 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతం కరోనాను గుర్తించేందుకు రక్తాన్ని సేకరించిన తరువాత పీసీఆర్ (పాలీమర్స్ చైన్ రియాక్షన్) విధానంలో పరీక్షలు జరుపుతున్నారు. ఈ విధానంలో రిపోర్టులు రావడానికి అధిక సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే గొంతు, ముక్కు నుంచి ద్రవాలను సేకరించి పరీక్షలు జరిపాలని ఐసీఎంఆర్ సూచించింది.


More Telugu News