లక్ష్మణ రేఖ దాటొద్దు.. ప్రజలకు మోదీ విజ్ఞప్తి

  • సామాజిక దూరమే మన ఆయుధం
  • ఇంట్లో  మీరు ఒంటరిగా ఉన్నారనుకోవద్దు
  • మీ వెంట 130  కోట్ల ప్రజలు ఉన్నారు
  • వీడియో సందేశంలో నరేంద్ర మోదీ
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే ఏకైక ఆయుధమైన సామాజిక దూరానికి అందరూ కట్టుబడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ లక్ష్మణ రేఖను ఎవ్వరూ దాటొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని శుక్రవారం ఉదయం మోదీ వీడియో సందేశం ఇచ్చారు.

‘సామాజిక దూరం అనే లక్ష్మణ రేఖను ఎవ్వరూ దాటొద్దు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లఘించకూడదు. కరోనా వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేసే శక్తి ఇదొక్కటే. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మార్చి 22న (జనతా కర్ఫ్యూ) మీరంతా కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని ప్రపంచం మెచ్చుకుంది. దీన్ని అన్ని దేశాలూ అమలు చేస్తున్నాయి.

కోట్లాది మంది తమ ఇళ్లకే పరిమితమైనప్పుడు.. కరోనాపై మనం ఒంటరిగా ఎలా పోరాటం చేస్తామని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ మనం ఒంటరి కాదు. ఇది 130 కోట్ల మంది బలం. ఈ విషయం మనందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది. మన లక్ష్యం ఏమిటో తెలియజేస్తుంది. దాన్ని అందుకునేందుకు అవరమైన శక్తిని ఇచ్చి మనకు సరైన దారిని చూపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఈ చీకటిలోనూ.. వెలుగుల వైపు చేరుకునేందుకు మనం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ వీడియో సందేశంలో వివరించారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్‌ లైట్లను ఆర్పేసి.. కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లైట్లు, సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్లతో 9 నిమిషాల పాటు గుమ్మం ముందు నిల్చోవాలని పిలుపు నిచ్చారు.


More Telugu News