మాస్క్ ల తయారీకి త్రీడీ పరిజ్ఞానం: జోద్‌పూర్‌ ఐఐటీ విద్యార్థుల ఘనత

  • పరిశీలన కోసం జిల్లా అధికారులకు అందజేత 
  • సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇస్కాన్‌ సర్జికల్స్‌కు టెక్నాలజీ బదిలీ
  • అధికార ప్రతినిధి అమర్‌దీప్‌ శర్మ వెల్లడి

కరోనా వ్యాధి నేపథ్యంలో బాధితులకు వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి తమ సేవలు అందిస్తున్నారు. అటువంటి వారి రక్షణ, సౌకర్యార్థం రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు త్రీడీ టెక్నాలజీతో సరికొత్త మాస్క్‌ను రూపొందించారు. కౌశల్‌ ఎ.దేశాయ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు అంకిత్‌ అగర్వాల్‌, శుభం వైష్ణవ్‌, ప్రతిక్‌ సొరాతియాలు ప్రయోగాత్మకంగా యాభై మాస్క్‌లు తయారు చేశారని ఐఐటీ అధికార ప్రతినిధి అమర్‌దీప్‌ శర్మ తెలిపారు.

‘మా విద్యార్థులు తయారు చేసిన మాస్క్‌లను జిల్లా అధికారులకు పంపాము. వారి నుంచి సంతృప్తి వ్యక్తమయ్యింది. దీంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారీసంఖ్యలో మాస్క్‌లు ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఇస్కాన్‌ సర్జికల్స్‌కు బదిలీ చేయనున్నాం’ అని శర్మ వివరించారు.

అదేవిధంగా జోద్‌పూర్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) వైద్య సిబ్బందికి ఉపయుక్తమయ్యే ప్రత్యేక రక్షణ పరికరాలతో కూడిన కిట్‌ను తయారు చేసింది. నిఫ్ట్‌ డైరెక్టర్‌ విజయ్‌దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ స్థానిక స్వయం సహాయక సంస్థల్లోని శిక్షణ పొందిన మహిళ సహాయంతో స్థానిక మార్కెట్‌ నుంచి సేకరించిన ఫేబ్రిక్‌ను ఉపయోగించి ఈ ఫ్రోటోటైప్‌ కిట్‌ను తయారు చేసినట్లు తెలిపారు.

జోద్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 'జోద్‌పూర్‌ మున్సిపల్ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ 'మాకు 300 కిట్లు అందాయి. వాటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం' అని తెలిపారు.



More Telugu News