కరోనా విరాళాల కోసం కాచుకు కూర్చున్న సైబర్ నేరగాళ్లు... నకిలీ అకౌంట్ తో టోకరా

  • దాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు
  • అధికారిక ఐపీలో ఒక్క అక్షరం తేడాతో ఫేక్ ఐపీ రూపకల్పన
  • గమనించకుంటే మీ విరాళం వారి పరమైనట్టే

సైబర్ నేరగాళ్లు సమయం కోసం కాచుకుకూర్చుని ఉంటారు. జనాల్లో వీరి మోసాలపట్ల ప్రస్తుతం కాస్త చైతన్యం పెరగడంతో పాత విధానంలో వీరి ఆటలు సాగడం లేదు. దీంతో కొత్త పోకడలతో మోసం చేయడం, ఖాతాలను ఖాళీ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం దేశం కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో పీఎం-కేర్స్ ఖాతాకు విరాళాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 


ఇక ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు పదును పెడుతున్నారు. పౌరులు అందించే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక యూపీఐ ఐడీ గురించి ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సైబర్ నేరగాళ్లు పీఎం సహాయ నిధి పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని గుర్తించారు.

ఒకే ఒక్క అక్షరం తేడాతో నకిలీ ఖాతాను సృష్టించినట్టు గుర్తించిన ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు వెంటనే అప్రమత్తమై దాన్ని బ్లాక్ చేశారు. ఇలాంటివి దాదాపు అర డజను వరకు సైట్లు ఉన్నాయని, దాతలు ఈ విషయాన్ని గుర్తించి తమ విరాళాన్ని బదిలీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకు కొన్ని సూచనలు చేశారు. అధికారిక భీమ్ యూపీఐ ఐడీ పీఎంకేర్స్ ఎట్ ద రేట్ ఎస్బీఐ(pmcares@sbi) అని ఉంది. దీనిలో కేర్స్ లో ఉన్న చివరి 'ఎస్' అక్షరాన్ని తీసేసి నకిలీ ఐడీని రూపొందించారు.

పరిశీలనగా చూస్తే తప్ప ఈ మార్పు గమనించలేం. కాబట్టి దాతలు పీఎం కేర్స్ లో ఉన్న చివరి 'ఎస్' అక్షరం లేని ఖాతాకు డబ్బు పంపితే సైబర్ నేరగాళ్ల పరం అయిపోతుంది. అందువల్ల ఒకటికి పదిసార్లు ఖాతాను సరిగా చూసుకుని విరాళాలు పంపాలని కోరుతున్నారు.



More Telugu News