బైక్‌పై వెళ్తుంటే లాక్కున్నారని.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య!

  • లాక్‌డౌన్ నేపథ్యంలో బైక్‌పై ఇంటికి బయలుదేరిన యువకుడు
  • బైక్ స్వాధీనం చేసుకున్న వెదుళ్లపల్లి పోలీసులు
  • తన మరణానికి పోలీసులే కారణమంటూ సెల్ఫీ వీడియో
పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాలోని పుట్లచెరువు గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాసరావు (21) చిత్తూరు జిల్లా నగరిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో స్వగ్రామం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో గత నెల 31న తన బైక్‌పైనే ఊరికి బయలుదేరాడు. బుధవారం స్టూవర్టుపురం చెక్‌పోస్టు వద్ద వెదుళ్లపల్లి పోలీసులు శ్రీనివాసరావును అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి యువకుడిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై అదే రోజు విడుదల చేశారు.

పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన శ్రీనివాసరావు మరుసటి రోజు ఉదయం బాపట్ల కొత్త బస్టాండు ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తనతో బాధ్యతారహితంగా వ్యవహరించారని, తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే, అతడు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News