కుమారుడి కళ్లముందే తండ్రిని చితకబాదిన కానిస్టేబుల్ సస్పెన్షన్.. ఇంటికెళ్లి పరామర్శించిన ఎస్పీ

  • తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘటన
  • కుమారుడి ముందే బాధితుడిని కిందపడేసి కుమ్మేసిన కానిస్టేబుల్
  • ప్రజలకు క్షమాపణలు చెప్పిన వనపర్తి ఎస్పీ
బైక్‌పై కుమారుడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్‌ సస్పెండయ్యాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఓ వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి మంత్రి కేటీఆర్, ఎస్పీ, డీజీపీలను ట్యాగ్ చేశాడు.

 ఇలాంటి పోలీసుల వల్ల మొత్తం పోలీసుల కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది  చూసిన కేటీఆర్.. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ హోంమంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకే వనపర్తి ఎస్పీ అపూర్వారావు బాధితుడిపై దాడిచేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాక, బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతడి కుమారుడితో కాసేపు ముచ్చటించారు.  

కాగా, అంతకుముందు వనపర్తికి చెందిన బాధిత వ్యక్తి తన కుమారుడితో కలిపి బయటకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపి, లాక్‌డౌన్‌ సమయంలో కుమారుడితో కలిసి ఇలా బయటకు వెళ్లడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కొంత దురుసుగా ప్రవర్తించాడు. బైక్‌పై 14 చలాన్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

ఆగ్రహంతో ఊగిపోయిన సదరు కానిస్టేబుల్ బాధితుడిని కిందపడేసి విచక్షణ రహితంగా దాడిచేశాడు. వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ స్పందించారు. ఫలితంగా కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఇదే విషయాన్ని వనపర్తి ఎస్పీ కేటీఆర్, తెలంగాణ పోలీస్ బాస్‌కు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ఘటనపై ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News