జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ల్లో పిలవని పేరంటాలు... మధ్యలో దూరి హంగామా చేస్తున్న ఆకతాయిలు!

  • వీడియో కాన్ఫరెన్స్ యాప్ గా గుర్తింపు తెచ్చుకున్న జూమ్
  • సెట్టింగ్స్ సరిగా లేకుంటే భద్రతకు ముప్పు
  • రెండంచెల పాస్ వర్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంటున్న నిపుణులు
ప్రస్తుతం భారత్ ఇంటి వద్ద నుంచే పనిచేస్తోంది అని చెప్పాలి. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి! దేశాలకు దేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్ భూతం ప్రపంచ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థలన్నీ తమ కార్యాలయాలను మూసివేసి ఇళ్ల వద్ద నుంచే ఉద్యోగులను పనిచేసేలా ప్రోత్సహించాయి. ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి జూమ్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. సహోద్యోగులతో ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు, ఇతర అంశాలపై చర్చించేందుకు జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది.

అయితే, కొందరు ఆకతాయిలు ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్ మధ్యలో చొరబడి పాటలు వినిపించడమే కాదు, అశ్లీల వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నారు. జూమ్ యాప్ సెట్టింగ్స్ లో ఉన్న 'డిఫాల్ట్ ఓపెన్ యాక్సెస్' అనే ఆప్షన్ ను మార్చకుండా కాన్ఫరెన్స్ లు నిర్వహించే వారికి ఇలాంటి పోకిరీ చేష్టలు ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిణామాలను టెక్కీలు 'జూమ్ బాంబింగ్' అని అభివర్ణిస్తున్నారు. జూమ్ యాప్ ను ఉపయోగిస్తున్న వ్యక్తులకే కాదు, సంస్థలకు కూడా ఈ తలనొప్పి తప్పడంలేదు.

ఇటీవల బ్రిటన్ ప్రధాని జూమ్ యాప్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించి, ఆ సమావేశం ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే ఆ ఫొటోల్లో జూమ్ వీడియో కాల్ సెషన్ ఐడీ కూడా కనిపిస్తోంది. దీనిపట్ల సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీడియో కాన్ఫరెన్స్ ఐడీ బహిర్గతం చేయడం సైబర్ నేరగాళ్లకు ద్వారాలు తెరిచినట్టేనని హెచ్చరిస్తున్నారు. భారత్ లోనూ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) సంస్థ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి పరిణామమే ఎదురైంది. పిలవని పేరంటంలా వచ్చిన తుంటరులు నానా హంగామా చేశారు.

దీనికి  విరుగుడు జూమ్ సెట్టింగ్స్ ను లాక్ చేయడమేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు మోడ్ ఉపయోగించాలని, పబ్లిక్ మీటింగ్ ఐడీని ఇతరులతో పంచుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే వారందరూ పాస్ వర్డ్ తో తమ ఐడీని నిర్ధారించుకునే ఏర్పాటు చేయాలంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ జరుగుతున్న సమయంలో 'దీన్ని ఎవరు పంచుకోగలరు?' అనే ఆప్షన్ లో 'హోస్ట్' అని నమోదు చేయాలని, అంతేకాకుండా రెండంచెల పాస్ వర్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, ఆకతాయిలపై జూమ్ యాప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


More Telugu News