మాస్కే అక్కర్లేదు... ముఖానికి గుడ్డ కట్టుకున్నా చాలంటున్న అమెరికా వైద్యాధికారులు!

  • ఉద్యోగులకు మెమో జారీ చేసిన సీడీసీ
  • ఓ స్కార్ఫ్ ధరిస్తే చాలంటున్న ట్రంప్
  • ఇప్పటికే అమెరికాలో ఎన్-95లకు తీవ్ర కొరత
  • మాస్క్ లు కొనవద్దని ప్రజలకు వినతి
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి ఓ గుడ్డను కట్టుకున్నా చాలని అమెరికా అంటోంది. ఈ మేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం ఓ అంతర్గత మెమోను ఉద్యోగులకు జారీ చేసిందని 'వాషింగ్టన్ పోస్ట్' తన కథనంలో పేర్కొంది. క్లాత్ మాస్క్ ను ధరించినా, వైరస్ వ్యాప్తిని తగ్గించుకోవచ్చని వెల్లడించింది.

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఓ స్కార్ఫ్ ను వాడితే చాలునని వ్యాఖ్యానించడం గమనార్హం. సీడీసీ జారీ చేసిన మెమో వివరాల ప్రకారం, సూపర్ మార్కెట్లకు వెళ్లినా, ప్రజల్లో తిరగాల్సి వచ్చినా, సింపుల్ గా క్లాత్ మాస్క్ ధరిస్తే సరిపోతుంది. ఇక తమ సూచనపై అభిప్రాయాన్ని చెప్పాలని సీడీసీ, ఇదే విషయాన్ని వైట్ హౌస్ కు చేరవేసింది.

మరోపక్క, ఆమధ్య సర్జన్ జనరల్ జీరోమ్ ఆడమ్స్ 'స్టాప్ బయ్యింగ్ మాస్క్స్' అంటూ ట్వీట్ చేశారు. సాధారణ ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా చేయడంలో అవి అంత ప్రభావవంతంగా పనిచేయవని పేర్కొన్నారు. వైద్య చికిత్సలను అందిస్తున్న డాక్టర్లకు మాస్క్ లు లేకుంటే, అది మొత్తం అందర్నీ రిస్క్ లో పడేస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారం, కేవలం హెల్త్ వర్కర్లు, వ్యాధి బారిన పడినవారు, వారికి చికిత్సను అందిస్తున్న వారు మాస్క్ లను ధరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో ఎన్ 95 మాస్క్ లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. వాడిన మాస్క్ లనే తిరిగి వాడాలని హెల్త్ కేర్ వర్కర్లకు ఉన్నతాధికారులు సలహా ఇస్తున్నారు. మాస్క్ లు లభించకపోతే, రుమాలు, స్కార్ఫ్ లను వాడాలని చెబుతున్నారు.

కాగా, అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 1.90 లక్షలను దాటిపోగా, మృతుల సంఖ్య 4 వేలను దాటింది. అమెరికాలోనూ, ఇటలీ తరహా పరిస్థితి కళ్ల ముందు కదులుతోందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ హెచ్చరించడం గమనార్హం. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా వింబుల్డన్ మెగా టెన్నిస్ టోర్నీని వాయిదా వేశారు. కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రుడావో తమ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించారు.


More Telugu News