ఒంటిమిట్టలో 7న సీతారాముల కల్యాణం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • రేపు శ్రీరామనవమి.. ప్రజలకు శుభాకాంక్షలు
  • తిరుమల గర్భాలయంలో సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి
  • ఈ ఏడాది ఆ విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తాం
రేపు శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల శ్రీవారి గర్భాలయంలో సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉన్నాయని, ఈ ఏడాది ఆ విగ్రహాలకు అభిషేకం జరిపి ఆస్థానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 7న
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు తమ ఇళ్ల నుంచే రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు.  2వ తేదీ నుంచి 11 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఎలాంటి లోపాల్లేకుండా నిర్వహిస్తామని అన్నారు.

 అది తిరుమల గర్భగుడి వీడియో కాదు..

తిరుమలలో శ్రీవారి గర్భగుడి లోకి వెళ్లి వీడియో తీశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. అలిపిరిలోని శ్రీవారి నమూనా ఆలయంలో తీసిన వీడియో అది అని, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఇలా దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. ఈ వదంతులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, టీటీడీలోని సైబర్ క్రైమ్ విభాగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎస్వీబీసీ ఛానెల్ వారి నైనా తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభం వరకే అనుమతిస్తామని, గర్భగుడిలోకి కెమెరాలతో ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అఖండ దీపం కొండెక్కిందని,  స్వామి వారికి కైంకర్యాలు, సేవలు చేయడం లేదంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఖండించారు. స్వామి వారి సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ వదంతులన్నింటిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


More Telugu News