చైనాలో మళ్లీ అలజడి.. వైరస్ లక్షణాలు లేని కరోనా కేసుల నమోదు

  • అలాంటి వారిని గుర్తించినా.. గోప్యత పాటిస్తున్న చైనా
  • దాదాపు 40 వేల కేసులు ఉన్నట్టు అంచనా
  • భయం భయంగా చైనా ప్రజలు
చైనాలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని అందరూ భావిస్తుండగా కొత్త విషయం బయట పడింది. వైరస్ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఆ దేశంలో రోజు రోజుకూ పెరుగుతోంది. దాంతో ప్రజలంతా భయం గుప్పిట్లో ఉండగా.. అలాంటి కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.  

కరోనా తగ్గిందని తేలడంతో చైనాలో చాలా ప్రాంతాల్లో నిషేధాలు ఎత్తేశారు. వైరస్‌ హాట్‌ స్పాట్ ప్రాంతాల్లో ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో జనజీవితం మళ్లీ సాధారణ దశకు వస్తోంది. కానీ, తమలో వైరస్‌ ఉందని తెలియకుండానే చాలా మంది ఇతరులకు అంటిస్తున్నారని తెలియడం ప్రజలను భయపెడుతోంది. దాంతో సాధారణ కేసులను, లక్షణాలు లేకుండా వచ్చిన పాజిటివ్‌ కేసులను ప్రభుత్వం వర్గీకరించింది. కానీ, ఈ వివరాలను అధికారిక లెక్కల్లో మాత్రం చేర్చలేదు. అయితే, వైరస్‌ లక్షణాలు లేని కరోనా కేసులు దాదాపు 40 వేల పైనే ఉంటాయని ‘సౌత్ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ న్యూస్‌ పేపర్ పేర్కొంది.
 
ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు ఈ కేసులను గుర్తించాలని ప్రభుత్వం గత వారమే ఆరోగ్య శాఖను ఆదేశించింది. లియోనింగ్‌ ప్రావిన్స్‌లో పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది.. మార్చి 31వ తేదీ వరకు  ఈ ప్రాంతంలో ఎలాంటి లక్షణాలు లేకున్న కూడా 52 మందిలో కరోనా ఉన్నట్టు గుర్తించారు. హునాన్‌ ప్రావిన్స్‌లో నాలుగు కేసులు గుర్తించగా, వాళ్లంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్లే అని అధికారులు తెలిపారు.

లక్షణాలు లేని వైరస్ కేసులను నివేదించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్‌ కూడా బుధవారం రంగంలోకి దిగింది. అలాంటి వారిని 14 రోజుల పాటు  క్వారంటైన్‌లో ఉంచుతామని ప్రకటించింది. సోమవారం వరకూ 1541 మందిని గుర్తించి పరిశీలనలో ఉంచామని చెప్పింది. ఈ నేపథ్యంలో లక్షణాలే లేకుండా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోందని నిపుణుల మధ్య చర్చ నడుస్తోంది. కాగా, చైనాలో 81 వేల కరోనా కేసులు నమోదవగా, 3305 మంది చనిపోయారు.


More Telugu News