రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిన పీఎన్బీ

  • పీఎన్బీలో విలీనమైన ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్
  • విలీనం తర్వాత పీఎన్బీకి 11 వేలకు పైగా బ్రాంచులు
  • రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్న వ్యాపార లావాదేవీలు
భారత్ లో మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లోకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీలీనం అయ్యాయి. ఈ క్రమంలో మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది.

ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా బ్రాంచులు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.


More Telugu News