అందరూ ఏకతాటిపైకి రాకుంటే ఈ ఉత్పాతాన్ని ఆపడం సాధ్యం కాదు: ఐక్యరాజ్య సమితి ఆందోళన

  • ఇది రాజకీయపరమైన పట్టింపులకు సమయం కాదు
  • ఏకతాటిపైకి రాకుంటే మానవ సంక్షోభం తప్పదు
  • ఐరాస 75 ఏళ్ల చరిత్రలో ఇదే పెను సంక్షోభం
ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టేసిన కోవిడ్-19 కారణంగా ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల అస్థిరత, అశాంతి, ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మాంద్యం ఇదే తొలిసారి కావొచ్చన్నారు.

కోవిడ్ మహమ్మారిపై పోరును ప్రపంచ దేశాలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన.. రాజకీయ పరమైన పంతాలకు ఇది సమయం కాదని, వాటిని ఇప్పుడు పక్కన పెట్టి ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరిగితే తప్ప ఈ మహమ్మారిని, అది సృష్టించే ఉత్పాతాన్ని ఆపడం సాధ్యం కాదన్నారు.

ఇది కేవలం ఆరోగ్య రంగాన్ని దెబ్బతీయడమే కాకుండా మానవ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఇదే తొలిసారని అన్నారు. కరోనాపై పోరులో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్ని బేఖాతరు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో వెనుకబడిన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలబడాలని, అవసరమైన సాయం చేయాలని గుటెరస్ కోరారు. ‘సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కోవిడ్-19 ప్రభావం’పై నివేదిక సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News