లాక్‌డౌన్‌లో అతిగా మద్యం, సిగరెట్‌ వద్దు: కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక

  • అలా చేస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది
  • మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది
  • కరోనాపై కంగారు పడొద్దని సూచన
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కొంత మంది అతిగా మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం చేస్తున్నారు. కానీ, అలా చేసే వారి రోగనిరోధక శక్తి  తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని చెప్పింది. కాబట్టి  ఆ రెండింటికీ సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించింది.

కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందువల్ల  వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని చెప్పింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించారని స్పష్టం చేసింది. ఇక,  ప్రపంచ వాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోందని మీడియా, సోషల్ మీడియా, టీవీలు, పేపర్లలో వస్తున్న వార్తలతో అందరిలోనూ భయం పెరిగిపోతోందని, దీని వల్ల మానసిక ఆందోళన ఎక్కువవుతోందని పేర్కొంది. అయితే, అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉన్న వాళ్లు టీవీ చూడటం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడంతో పాటు తమకు నచ్చిన పనులు చేస్తూ నెగిటివ్‌ ఆలోచనలు రాకుండా చూసుకోవాలని సూచించింది.

 వైరస్ సోకిన వారు కూడా భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి చాలా మంది బయటపడ్డారని, వైద్యుల సూచన ప్రకారం చికిత్స తీసుకోవాలని సూచించింది. వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.


More Telugu News