తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్

  • స్నేహితుడికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో నకిలీ జీవో
  • అబ్కారీ అధికారులకు ఫోన్లు
  • సూత్రధారి సనీష్ కుమార్‌ అరెస్ట్
తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన కె.సనీష్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 28న సోషల్ మీడియాలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయన్న పోస్టును చూశాడు. దీనిని కాపీ చేసిన సనీష్.. ప్రభుత్వ జీవోలా దానిని మార్చి మద్యం వ్యాపారి అయిన తన స్నేహితుడు గౌడ్‌కు పంపించాడు. అది చూసి నిజమేనని నమ్మిన ఆయన మరికొందరికి పంపించాడు.

దీంతో కొన్ని గంటల్లోనే వందలమందికి షేర్ అయింది. ఈ నకిలీ జీవోను చూసిన చాలామంది అబ్కారీ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీశారు. స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు దీనికి సూత్రధారి సనీష్ అని తేల్చారు. స్నేహితుడికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడని నిర్ధారించారు. నిన్న అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.


More Telugu News