ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పారన్న ఇమ్రాన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పాక్ మీడియా!

  • మోదీ వ్యాఖ్యలపై ఇమ్రాన్ సొంత భాష్యం
  • ఇమ్రాన్ ది అవగాహన రాహిత్యం అంటూ పాక్ మీడియా విమర్శలు
  • మోదీ ఏమన్నారో వివరించిన పాక్ మీడియా
కరోనా మహమ్మారిపై భారత్, పాకిస్థాన్ దేశాధినేతలు ఎవరి శైలిలో వారు పోరాడుతున్నారు. భారత్ లో తిరుగులేని విధంగా లాక్ డౌన్ అమలు చేస్తుండగా, పాక్ లో మాత్రం ఆంక్షలతో సరిపెట్టారు. 1727 పాజిటివ్ కేసులు నమోదైనా  ఇప్పటికీ అక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించలేదు. అయితే, పాకిస్థాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యాన్ని మరోసారి బట్టబయలు చేశాయి.

భారత్ లో లాక్ డౌన్ విధించినందుకు అక్కడి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పారని, లాక్ డౌన్ అనేది ఎంత తప్పు నిర్ణయమో తనకు తెలుసని అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది ఎవరో కాదు, పాక్ మీడియానే తూర్పారబట్టింది. భారత ప్రధాని ఏమన్నారో సరిగా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అంటూ తలంటింది. వాస్తవానికి మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇలా అన్నారంటూ వివరించింది.

"ఎంతో కఠినమైన పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాం. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడమే సరైన నిర్ణయం. అయితే లాక్ డౌన్ కారణంగా మీకు కలిగిన అసౌకర్యానికి, మీరు పడుతున్న కష్టాలకు నన్ను క్షమించండి" అని మాత్రమే తెలిపారని వెల్లడించింది. అంతేతప్ప, లాక్ డౌన్ ప్రకటించినందుకు ఆయన క్షమాపణలు కోరలేదు అంటూ పాక్ మీడియా ప్రధాని ఇమ్రాన్ కు హితవు పలికింది. ఈ విషయంలో పాక్ లోని ప్రముఖ మీడియా చానల్ జీయో ఇమ్రాన్ ను విమర్శించింది.


More Telugu News