బాల్యంలో వేసే 'బీసీజీ' టీకాతో కరోనా ముప్పు తక్కువంటున్న పరిశోధకులు!

  • బీసీజీ టీకా కరోనాను సమర్థంగా ఎదుర్కొంటుందని అధ్యయనంలో వెల్లడి
  • ఇటలీ, స్పెయిన్ దేశాల్లో బీసీజీ టీకా నిలిపివేసి ఉండొచ్చన్న పరిశోధకులు
  • మరణాల్లో చైనాను మించిపోయిన ఇటలీ, స్పెయిన్
ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండడానికి... చైనా, భారత్ వంటి దేశాల్లో తక్కువగా ఉండడానికి కారణం బీసీజీ టీకాయేనంటూ పరిశోధకులు ఓ ఆసక్తికరమైన విషయాన్ని ముందుకు తీసుకువచ్చారు. సాధారణంగా ఓ శిశువు జన్మించిన తర్వాత నెలల సంఖ్యను అనుసరించి అనేక టీకాలు వేస్తారు. పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంపొందించడమే ఆ టీకాల లక్ష్యం. ఆ విధంగా వేసే టీకాల్లో బీసీజీ వ్యాక్సిన్ కూడా ఒకటి. నవజాత శిశువులను క్షయ వ్యాధి కబళించకుండా ఈ బీసీజీ టీకా రక్షాకవచంలా పనిచేస్తుంది.

అయితే ఇప్పుడు ఓ తాజా పరిశోధనలో ఆసక్తికర అంశం వెల్లడైంది. బాల్యంలో బీసీజీ టీకా వేయించుకున్నవారికి కరోనా ముప్పు తక్కువని అంటున్నారు. కొవిడ్-19 మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో చాలాకాలం కిందటే బీసీజీ టీకాలను మధ్యలోనే నిలిపివేయడం కానీ, అసలు వేయకపోవడం కానీ జరిగిందని తాజా అధ్యయనంలో గుర్తించారు.

అదే సమయంలో భారత్, చైనా వంటి దేశాల్లో బీసీజీ టీకాలు ఇప్పటికీ వేస్తూనే ఉన్నారని, ఈ టీకా కారణంగానే ఆయా దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. భారత్ లో పిల్లలకు బీసీజీ టీకాలు వేయడాన్ని 1949లోనే ప్రారంభించారు. అదే ఇరాన్ లో బీసీజీ టీకాల పాలసీ 1984 నుంచి అమలులో వుంది. అందుకే అక్కడ కరోనా మరణాల రేటు అధికంగా వుందని అధ్యయనకారులు ప్రస్తావిస్తున్నారు.  

కరోనా వైరస్ చైనాలో పుట్టినా అక్కడ మరణాలు 3 వేల పైచిలుకు మాత్రమే. కానీ ఇటలీ, స్పెయిన్ దేశాల్లో అంతకు రెట్టింపు సంఖ్యలో మరణాలు సంభవించడాన్ని పరిశోధకులు ఇందుకు నిదర్శనంగా ప్రస్తావించారు.


More Telugu News