అందుకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరం: చంద్రబాబు

  • కరోనా వ్యక్తి తాకిన వస్తువులను ఎవరు తాకినా వస్తుందని వెల్లడి
  • పాజిటివ్ వ్యక్తులను సమాజం నుంచి వేరుచేసి చికిత్స అందించాలని సూచన
  • పలు ఆరోగ్య సూచనలు కూడా చేసిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కరోనా పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వ్యాధి ప్రమాదకరమైనదని, కరోనా వ్యక్తి ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువును ఇతరులు తాకితే వారికి కూడా కరోనా సోకుతుందని అన్నారు. ఆ వస్తువును ఎంతమంది తాకితే అందరికీ కరోనా వస్తుందని స్పష్టం చేశారు. అందుకే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని వివరించారు.

దక్షిణ కొరియాలో కేవలం ఒక వ్యక్తి ద్వారా వేలమందికి వ్యాపించిన విషయం మరువరాదని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక స్లైడ్లు వేసి మీడియాకు ప్రదర్శించారు. కొరియాలో ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాన్ని వివరించారు. అక్కడ ఒక వ్యక్తి నుంచి కొంతమందికి, ఆ కొంతమంది నుంచి అనేకమందికి... ఆ విధంగా రెట్టింపు అయిందని పేర్కొన్నారు.

కరోనా బాధితులను సమాజం నుంచి వేరుచేసి చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను నివారించుకోవచ్చని, వేడినీళ్ల ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుందని వివరించారు. వేడినీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలని అన్నారు. అంతేకాకుండా ఆహారం పరిమితంగానే, అవసరం మేరకు తరచుగా తీసుకోవాలని తెలిపారు. మంచి నీరు ఎక్కువగా తాగుతుండాలని, చిరుతిండ్లు తగ్గించాలని పేర్కొన్నారు.

వండిన ఆహారం కారణంగా కరోనా రాదని తేలిందని, ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు. ఎక్కడికైనా బయటికి వెళ్లి వచ్చినప్పుడు చెప్పులతో సహా ప్రతి ఒక్క వస్తువును శుద్ధి చేసుకోవాలని, తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి కలిగించే సి విటమిన్ ఉన్న జామపండ్లు, ఇతర ఫలాలు ఎక్కువగా తీసుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు.


More Telugu News