స్మార్ట్ ఫోన్లపై కరోనా వైరస్ ఎన్నిరోజులు సజీవంగా ఉంటుందో తెలుసా..?

  • ఫోన్ వాడకం ద్వారా కూడా కరోనా సోకే అవకాశాలు
  • గాజు ఉపరితలంపై కరోనా వైరస్ 4 రోజులు జీవించే అవకాశం
  • ప్లాస్టిక్ పై 3 రోజుల వరకు మనుగడ
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు కూడా జీవితంలో ఓ భాగం అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఫోన్ ను వాడినప్పుడు ఆ చేతులను ముఖానికి తాకించుకుంటే వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. 2003లో వచ్చిన 'సార్స్' వైరస్ గ్లాస్ (గాజు) ఉపరితలంపై 4 రోజులు మనగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ అధ్యయనంలో తెలిపింది. తాజాగా, ' నావెల్ కరోనా' (సార్స్ కొత్త వెర్షన్) వైరస్ పై అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న నావెల్ కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ ఉపరితలాలపై 3 రోజుల వరకు సజీవంగా ఉండగలదని, కార్డు బోర్డు ఉపరితలాలపై 24 గంటలు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ గాజు ఉపరితలంపై ఎంతకాలం బతకగలదన్న విషయం తాజా అధ్యయనంలో స్పష్టం కాకపోయినా, గత అధ్యయనాల ఆధారంగా నాలుగు రోజుల పాటు జీవించగలదని భావిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారుచేస్తారన్న సంగతి తెలిసిందే.


More Telugu News