కరోనా తెచ్చిన సమస్య... 'ఎర్రగడ్డ' ఆసుపత్రికి చేరుతున్న బాధితులు!

  • నిన్న ఒక్కరోజులో 94 కేసులు
  • 46 మంది పరిస్థితి విషమం
  • అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తున్న వైద్యులు
కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ తో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా కల్లు కాంపౌండ్ లు, మద్యం షాపులు మూత పడటంతో, మందుకు అలవాటు పడిన ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. వందలాది మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజులో ఆసుపత్రికి 94 మందిని చికిత్స నిమిత్తం తీసుకుని వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వీరందరికీ వెంటనే చికిత్సను అందించకుంటే, ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా, గడచిన పది రోజులుగా మద్యం షాపులు, కల్లు కాంపౌండ్ లూ మూత పడిన సంగతి తెలిసిందే. మద్యం అందక, పిచ్చిగా ప్రవర్తిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 మంది ఆత్మహత్యలు చేసుకోగా, మరో 20 మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మద్యం, కల్లు దొరకకనే పలువురు వింతగా ప్రవర్తిస్తున్నారని, వీరిలో అత్యధికులు మధ్య వయసువారేనని ఎర్రగడ్డ మానసిక వైద్యులు అంటున్నారు. సోమవారం నాడు ఆసుపత్రికి వచ్చిన 94 మందిలో 46 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ఆసుప్రతిలో అడ్మిట్ చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఇదిలావుండగా, మద్యం, కల్లుకు అలవాటుపడ్డ వారు కత్తులతో చేతులు కోసుకోవడం, భవనాల పైనుంచి దూకడం, రోడ్లపై పరుగులు పెట్టడం, ఆందోళనతో ఎవరో తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడటం, ఆడ్డువచ్చిన కుటుంబీకులను చంపేందుకు కూడా వెనుకాడక పోవడం వంటి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని రావాలని వైద్యులు సూచిస్తున్నారు.


More Telugu News