అదీ ఓ ఫేక్ న్యూసే... ఆర్థిక సంవత్సరం పొడిగింపుపై కేంద్రం!

  • అటువంటి ఆలోచనేమీ చేయలేదు
  • స్టాంప్ యాక్ట్ సవరణలను తప్పుగా అర్థం చేసుకున్నారు
  • స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రచారమవుతున్న వార్త అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ, ఇది ఓ ఫేక్ న్యూస్ అని పేర్కొంది.

"సోషల్ మీడియాతో పాటు, ఓ సెక్షన్ మీడియాలో వచ్చినట్టుగా ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించ లేదు. మార్చి 30న ప్రభుత్వం జారీ చేసిన ఓ నోటిఫికేషన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇండియన్ స్టాంప్ యాక్ట్ కు చేసిన సవరణలను తప్పుగా కోట్ చేశారు. ఆర్థిక సంవత్సరం పొడిగింపు ఆలోచనేమీ లేదు" అని పేర్కొంది.

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 నెలల పాటు కొనసాగుతుందని, పారిశ్రామిక, ఆర్థిక వర్గాలకు సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం వెల్లడించినట్టు పుకార్లు వ్యాపించాయి. 2020 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1 నుంచి మొదలవుతుందని కూడా పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.

సోమవారం సాయంత్రం స్టాంప్ డ్యూటీ అప్లికబిలిటీ తేదీని ఏప్రిల్ 1 నుంచి జూలై 1కి మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం జారీ చేసింది. ఈ నోటిఫికేషనే మీడియాలో ఆర్థిక సంవత్సరం మార్పు చేసినట్టుగా వచ్చింది.  


More Telugu News