అమెరికాలో ఆందోళన కలిగిస్తున్న మరణాలు.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య

  • నిన్న ఒక్క రోజే 540 మంది మృతి
  • 1.63 లక్షలకు చేరిన బాధితుల సంఖ్య
  • ఆసుపత్రులు చాలక భారీ ఓడను ఆసుపత్రిగా మార్చిన వైనం
కరోనా బాధిత దేశంగా మారిన అమెరికాలో మరణాల సంఖ్య నిన్నటికి మూడువేలు దాటిపోయింది. సోమవారం ఒక్క రోజే అక్కడ ఏకంగా 540 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 3017కు పెరిగింది. 1.63 లక్షల మంది వైరస్ బారినపడి పోరాడుతున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ఇక్కడ చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో కూడా చోటు లేకపోవడంతో ఓ భారీ నౌకను ఆసుపత్రిగా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది.

మరోవైపు కాలిఫోర్నియాలో గత నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. ఐసీయూలో చేరుతున్న బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్టు గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు. కాగా, భారత్‌లో ఉన్న అమెరికన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. 50 దేశాల్లో ఉన్న 25 వేల మంది అమెరికన్లను దేశానికి తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఇంకా 9 వేల మంది వివిధ దేశాల్లో ఉన్నారని వివరించింది.


More Telugu News