కేరళలో కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడిన 93 ఏళ్ల వృద్ధుడు!

  • అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బయటపడిన వృద్ధ దంపతులు
  • ఇటలీ నుంచి వచ్చిన కుమారుడి వల్ల ఏడుగురికి సోకిన వైరస్
  • వారందరూ కోలుకున్నారన్న మంత్రి శైలజ
కరోనా మహమ్మారి బారినపడిన కేరళ వృద్ధ దంపతులు కోలుకున్నారు. వీరిలో భర్త వయసు 93 ఏళ్లు కాగా, అతడి భార్య వయసు 88 సంవత్సరాలు. వారిద్దరూ వైరస్‌ను జయించినట్టు కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వారిద్దరికీ బీపీ, షుగర్‌తో పాటు వృద్ధాప్యపు సమస్యలు ఉన్నప్పటికీ వైరస్ బారి నుంచి వారు బయటపడ్డారని పేర్కొన్నారు.

పథనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వీరి కుమారుడు.. భార్యాపిల్లలతో కలిసి ఇటీవల ఇటలీ నుంచి తిరిగొచ్చాడు. అప్పటికే వారికి వైరస్ ఉండడంతో అది వారి కుటుంబంలోని మొత్తం ఏడుగురికి సోకింది. వెంటనే వారందరినీ కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధ దంపతులు సహా కుటుంబంలోని మిగతా వారందరూ కోలుకున్నారని, వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చాయని వైద్యులు తెలిపారు. త్వరలోనే వీరిని ఇంటికి పంపిస్తామన్నారు.

కాగా వీరికి చికిత్స అందించిన ఓ నర్సు మాత్రం కరోనా బారినపడ్డారని, ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు మంత్రి శైలజ తెలిపారు. కేరళలో నిన్న నమోదైన 32 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 222కు చేరుకుంది.


More Telugu News