రైలు బోగీలే ఐసోలేషన్ వార్డులు... 20 వేల పడకలను సిద్ధం చేస్తున్న ఇండియన్ రైల్వేస్!

  • జోనల్ రైల్వే మేనేజర్లకు అందిన ఆదేశాలు
  • ఇప్పటికే ప్రారంభమైన పనులు
  • క్యాబిన్ లను సమూలంగా మార్చేస్తున్న సిబ్బంది
ఇండియాలోని పలు ప్రాంతాల్లో రైల్వే బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చాలని రైల్వే బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు జోనల్‌ రైల్వే మేనేజర్లందరికీ కేంద్రం లేఖలు రాసింది. తొలి దశలో 5000 రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని, ఆపై 20 వేల వరకూ బోగీలను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ఆదేశిస్తూ, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరింది.

ఆర్మ్‌ డ్‌ ఫోర్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తోపాటు వేర్వేరు రైల్వే జోన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే నమూనా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేశామని బోర్డు తెలిపింది. కరోనాను ఎదుర్కొనే చర్యలపై మార్చి 25న ఓ సమీక్షా సమావేశం నిర్వహించామని, ఆ సమావేశంలోనే కొన్ని బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. నాన్‌ ఏసీ, స్లీపర్‌ బోగీలను మాత్రమే మారుస్తున్నామని అన్నారు.

ఇక ఇందులో భాగంగా, ఓ చెక్క పలకను టాయిలెట్ లో అమర్చడం ద్వారా దాన్ని స్నానాల గదిగా మారుస్తారు. అక్కడే ఒక బకెట్, మగ్, సోప్‌ డిస్పెన్సర్‌ ఉంచుతారు. వాష్‌ బేసిన్లలోని కుళాయిలను సైతం మార్చేస్తారు. వాష్ రూమ్ సమీపంలోని తొలి కేబిన్‌ వద్ద ఆసుపత్రుల్లో వాడే తెరలను వినియోగిస్తారు. ఫస్ట్ కేబిన్‌ లో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, వారికి సంబంధించిన సామాన్లు ఉంటాయి. ఇక్కడే ఆక్సిజన్‌ సిలిండర్లను బిగిస్తారు.

ఇక ప్రతి కేబిన్ లో మధ్యలో ఉండే బెర్త్‌లను తొలగిస్తారు. ప్రతి కేబిన్‌ లోనూ అదనంగా బాటిల్‌ హోల్డర్లను, కిటికీలపై దోమతెరలను, డస్ట్‌ బిన్స్, బయటి వేడి లోపలికి రాకుండా వట్టివేళ్ల తడికలు వంటివి అమరుస్తారు. ల్యాప్‌ టాప్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లన్నీ పని చేసేలా చూస్తామని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.


More Telugu News