తన పీఏకి కరోనా పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లనున్న ఇజ్రాయెల్ ప్రధాని

  • ప్రముఖులను కూడా వదలని కరోనా
  • వారం కిందట పార్లమెంటు సమావేశాలకు హాజరైన నెతన్యాహు
  • పీఏ కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తింపు
ప్రాణాంతక కరోనా భూతం ప్రముఖులను కూడా వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అర్ధాంగి కరోనా బాధితులయ్యారు. స్పెయిన్ యువరాణి ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయింది.

తాజాగా, తన వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్వారంటైన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వారం కిందట నెతన్యాహు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పీఏ కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. పీఏకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రధాని నెతన్యాహు సహా ఇతర సహాయసిబ్బంది క్వారంటైన్ లోకి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. నెతన్యాహు సహా ఇతరులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.


More Telugu News