ఏపీలో వృద్ధాశ్రమాలు, అనాధ బాలల కేంద్రాలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు
- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం
- ఈ మేరకు జీఓ నెంబర్ 58 జారీ
- పౌర సరఫరాల సంస్ధ ద్వారా వీటి పంపిణీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీప్రభుత్వం నిరుపేదలకు ఉపకరించేలా మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. వృద్ధాశ్రమాలు, అనాధ బాలల కేంద్రాలలో ఉన్న అభాగ్యుల కోసం ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించాలని ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి జీఓ నెంబర్ 58 జారీ చేశారు.
ఈ నూతన కార్యక్రమం గురించి వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కృతికా శుక్లా తెలియజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వేతర సంస్ధల నేతృత్వంలో నడుస్తున్న వృద్దాశ్రమాలు, అనాధ బాలల కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ తరహా సంస్ధలు అన్నింటిలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఇవ్వాలని ఆదేశించారని, పౌర సరఫరాల సంస్ధ ద్వారా వీటి పంపిణీ జరుగుతుందని వివరించారు. తమ శాఖ వద్ద ఎన్జీఓలు నిర్వహించే సంస్ధల వివరాలు సిద్ధంగా ఉన్నాయని కృతిక శుక్లా తెలిపారు,