అనేక ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోవడం పట్ల వెంకయ్యనాయుడు విచారం

  • వలస కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పిలుపు
  • స్థానికులు చొరవచూపి ఆదుకోవాలని సూచన
  • కష్టసుఖాలు పంచుకోవడం భారతీయతకు మూలం అంటూ వ్యాఖ్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల పాలిట విఘాతంలా పరిణమించింది. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా రోడ్లపైకి వస్తున్న వలస కార్మికులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బందిగా పరిణమించారు. తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కావు.

దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వలస కార్మికుల పట్ల ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. స్థానికులు కూడా వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, వారికి తిండి, వసతి ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమైక్య జీవనం, కష్టసుఖాలను పంచుకోవడం భారతీయ జీవనశైలికి మూలం అని తెలిపారు.

అంతేకాకుండా, వలస కార్మికుల సమస్యను చక్కదిద్దాలంటూ కేంద్రంతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ వలస కార్మికుల అంశంలో సరైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాలకు సూచించారు.


More Telugu News